Sri Bhagavadgeetha Madanam-1    Chapters   

శ్రీ భగవద్గీతా మథనము

శ్రీ మహా భాగవత నవనీతము

1 శ్రీ మహాభాగవత ప్రాశస్త్యము

శ్రీమత్‌ క్షీరార్ణవ శేషశాయి యగు శ్రీహరి అవతారముల ఔన్నత్యమును, భక్తరక్షణ పరాయణత్వమును వర్ణించు ఇతివృత్తము గల పురాణము శ్రీ మహా భాగవతము, ఈ పురాణము గూర్చి పలుకునప్పుడు పోతన రచించిన క్రింది పద్యములు జ్ఞాపకమునకురాక మానవు.

భాగవతము తెలసి పలుకుట చిత్రంబు

శూలికైన, తమ్మి చూలికైన;

విబుధవరుల వలన విన్నంత కన్నంత

తెలియ వచ్చినంత తేట పరతు. భాగవతము 1-19

భాగవతము దేట బఱుప నెవ్వరు సాలు

శుకుడు దక్క? నరుని సఖుడు దక్క?

బుద్ధి దోచినంత బుధులతో విన్నంత

భక్తి నిగిడినంత పలుకువాడ. భాగ. 6-23

భావతమును గూర్చి తెలుపుటకు శుకునకు శ్రీకృష్ణునకు దక్క ఇతరులకు సాధ్యముకాదు. బ్రహ్మ రుద్రాదులకు గూడ తెలియజెప్పుటకుసాధ్యముకాని భాగవతమును గూర్చి నేను విమర్శింప బూనుట సాహస కార్యమైనను----

అపశబ్దంబుల గూడియున్‌ హరి చరిత్రాలాపముల్‌

సర్వపాప పరిత్యాగము సేయు'' భాగ. 1-97

అను భాగవత వాక్యము ననుసరించి, భగవత్తత్వార్థ ప్రతి పాదకమగు భాగవతమును గూర్చి పలుకుట పుణ్యదాయకమని భావించి ఈ రచనకు పూనుకొంటిని.

కం|| పికెడిది భాగవతమట,

పలికించెడివాడు రామభద్రుండట, నే

బలికిన భవహర మగునట,

పలికెద, వేరొండుగాథ బలుకగనేలా భాగ. 1-18

ఇతర ప్రాపంచిక విషయముల గూర్చి వర్ణింపక భగవంతుని కథా విశేషములు పలికిన మోక్షము చేకూరును. అందువలన పోతన ఇతర ఇతివృత్తముల వదలి భాగవతమునే పలికెను. కాని భారమును తన పైన వేసికొని కర్తృత్వమును తన కంటగట్టుకొనలేదు. వినమ్రతతో ''పలికించెడివాడు రామభద్రుండని'' తెలుపుకొనెను. ఇంకను మొదటి పద్యములో ''విన్నంత'' అనుటలో తాను గురువులవద్ద బోధరూపమున విన్నదియు (learning) ''కన్నంత'' అనుటవలన తాననుభవించి నదియు (Experience), ''తెలియ వచ్చినంత'' అనుటవలన తన బుద్ధికి గోచరించినదియు (Wisdom) తాను తెలుపబూనెను. ఎందుకనగా భాగవతాంధ్రీకరణము సులభముకాదు.

శ్లో|| విద్యావతా భాగవతే పరీక్షా

విపత్తి కాలే గృహిణీ పరీక్షా

రణాంగణ శస్త్ర భృతాం పరీక్షా

ధనుంజయే హాటక సంపరీక్షా.

పండితులకు భాగవతము పరీక్ష. ఇల్లాలికి కష్టకాలము పరీక్ష, యుద్ధమున వీరునకు పరీక్ష, అగ్నిలో బంగారమునకు పరీక్ష. అను టచే భాగవతమును గూర్చి తెలుపుట కష్ట సాధ్యముకదా!

2. భాగవతము, భగవద్గీత - వీనికి గల సంబంధము.

భగవత్తత్వార్థ ప్రతిపాదనమున గీతకు పిమ్మట భాగవతమని ఒక ''కవిత్వవేది'' వచించెను.

ఎ) భగవద్గీత ఒక శాస్త్రమైనచో భాగవతము దాని ఆచరణ విధానము (Theory and Practice). రెండింటికిని అవినాభావ సంబంధముకలదు. బి) ఒకటి భగవద్వాణి. రెండవది వాఙ్మయావతారము. సి) ఒకటి లక్షణము. రెండవది లక్ష్యము. డి) భగవద్గీతలో ప్రతి అధ్యాయము చివరను అది బ్రహ్మవిద్యగా చెప్పబడినది. భాగవతముకూడ హయగ్రీవ బ్రహ్మవిద్య. సాత్వతసంహిత, పారమ హంస్యము అని పేర్కొనబడినది.

''భాగవతో వాఙ్మయావతారః''

భాగవతము వాఙ్మయరూప భగవదవతారము. ఇట్టి పొగడ్త ఏ పురాణమునకు లభించలేదు.సంస్కృత భాగవతమునకు 81 వ్యాఖ్యానములలు కలవని Sri Ram Narayan Vyas, M.A., Ph.D., D.Litt, గారు తెలిపిరి. వీనిలో శ్రీధరీయ వ్యాఖ్యను పోతన అనుసరించెను. భాగవతము హిందూదేశమునగల అన్ని భాషలలోనికి అనువదింపబడినది. 1840 లోనే ఫ్రెంచి భాషలోనికి అనువదించబడినది.

ఇ) భగవద్గీత ఉపనిషత్తుల సారము - శ్రీకృష్ణుడుత్తమ వక్త; అర్జును డుత్తమ శ్రోత.

శ్లో|| సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాల నందనః

పార్ధో వత్సఃసుధీ ర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్‌ ||

ఉపనిషత్తులు ఆవులు, శ్రీకృష్ణుడు పాలు పితుకువాడు. అర్జునుడు లేగదూడ,పాలు గీతామృతము, ఆ పాలు త్రాగువారు బుద్ధి మంతులు.

భగవద్గీతవలెనే భాగవతముకూడ వేదోపనిషత్తుల సారమేయని పద్మపురాణము ప్రశంసించుచున్నది. పరీక్షిత్తు ఉత్తమ శ్రోత. శుకావధూత ఉత్తమ వక్త.

శ్లో|| వేదోపనిషదాం సారా

జ్ఞాతా భాగవతీ కథా

అత్యుత్తమా తతోభాతి

పృథ గ్భూతా ఫలోన్నతిః

ఎఫ్‌) వేదములు అపౌరుషేయములు. భగవద్గీత భాగవతములు కూడ అపౌరుషేయములే. ఋగ్వేదములోని ఋక్కులకు మంత్రద్రష్ట లెన ఋషులు పేర్కొనబడిరి కదా? అవి అపౌరుషేయము లెట్లగునని ప్రశ్నించవచ్చును. మంత్రద్రష్టయైన ఆ ఋషి సత్త్వరజస్తమో గుణములను దాటి, స్థూలసూక్ష్మ కారణదేహముల నధిగమించి సమాధి స్థితిలో ఆత్మసాక్షాత్కారమును పొంది. తన యనుభూతిని వాగ్రూపమున ఋక్కులుగా వర్ణించి యుండవలయును. ఈ ఋక్కులు మనస్సున కందరానిస్థితిలో దర్శింపబడినవి. ''యతో వాచో నివర్తం తే ఆప్రాప్య మనసా సహ'' అనబడు సమాధిస్థితిలో దర్శించిన ఋక్కులు మనస్సుతో, తర్కము నాధారము చేసికొని చెప్పబడు సామాన్య మానవ వచనములు కావు. అందువలన అవి అపౌరుషేయములు దీనిని నిరూపించుటకై శ్రీ వాసిష్ఠ గణపతిముని తన శిష్యుడైన దేవారాతునకి సమాధిస్థితిని కలిగించి క్రొత్త ఋక్కులను అతనిచే చెప్పించగలుగుట ఇందులకు పరమ నిదర్శనము.

భాగవతమును తొలుత నారాయణుడు బ్రహ్మ కుపదేశించెను. బ్రహ్మ నారదునకు వివరించెను. కాన భాగవతము భగవత్ర్పోక్తము, ఋషి సంప్రదాయానుగీతము, అట్లే భతవద్గీతకూడ శ్రీకృష్ణునిచే తొలుత సూర్యునికి చెప్పబడినది. సూర్యుడు మనువునకు, మనువు ఇక్ష్వాకునకు తెలిపెను. కావున భాగవత భగవద్గీతలు అపౌరుషేయములే.

జి) భగవద్గీత ధర్మార్థకామ మోక్షములను చతుర్విధ పురుషార్ధములనుద్దేశించి అర్జునునకుపదేశింపబడినది. భాగవతము మోక్ష కాముడైన పరీక్షిత్తునకుపదేశింపబడినది. హెచ్‌) భగవద్గీతలో, కర్తవ్యము తెలియక అర్జునునకు విషాదయోగము కలిగినది. స్వధర్మాచరణమున శాంతి లభింపక పోవుటచేత వ్యాసునకు భాగవతమున విషాదయోగము కలిగినది. పై కారణములను బట్టి భగవద్గీత భాగ వతములకు అత్యంత సన్నిహిత సంబంధము కలదని విశదమైనది కదా! ఇంకను ఉత్తరగీతలో ఆత్మను గూర్చి మరల వివరింపబడి ఆత్మజ్ఞానమును పొందు సాధన మార్గముకూడ వివరింపబడినవి.

భగవద్గీతయా? భాగవతమా? ఏది ముందుగా వ్రాయబడినది.

శ్రీకృష్ణుడు ఘోర అంగిరస ప్రోక్తమైన భాగవత ధర్మములను విని తన శిష్యుడైన అర్జునునకు భగవద్గీత రూపమున ఉపదేశేంచినట్లు ''The Synthetic Philosophy of the Bhagavatha'' అను గ్రంధమున వ్రాయబడియున్నది. కృష్ణునుకు గురువైన అంగిరస ఘోరుడే ఋగ్వేద సూక్తకర్త యని వాసిష్ఠ గణపతిముని తెలిపెను.

''There is no escape" says Roy Chaudhary "from the conclusion that these doctrines are acually learnt by krishna from Ghora Angirasa and were transmitted by himto his disciples-the Bhagavathas, and formed the kernel of the poem known as Bhagavadgita.''

దీని వలన భగవద్గీత పైన జెప్పినట్లు (సర్వోపరిషదో గావో) ఉపనిషత్తుల సారమా? లేక భాగవత ధర్మముల సంపుటియా? అని కొంత విచారణ అవసరమగుచున్నది, The Times of Astrology అను పత్రికలో Miles Davis, Ph.D., అను పండితుడు, భాగ వతమును పూర్వము హరిదాసులు హరికథారూపమున చెప్పుచుండెడి వారనియు, తరువాత వ్యాసుడు ఆ కథలను లిఖితరూపమున పురాణముగా వ్రాసెననియు (Compiled) తెలిపెను. దీనికి ఆధారము భాగవతముననే కలదు. బ్రహ్మ నారదునితో ఇట్లు తెలిపెను.

మ|| నిగమార్ధ ప్రతిపాదక ప్రకటమై నిర్వాణ సంధాయిగా

భగవంతుండు రచింప భాగవత కల్పక్ష్మాజమై, శాస్త్ర రా

జి గరిష్ఠంబగు నీ పురాణకథ సంక్షేపంబునన్‌ జెప్పితిన్‌

జగతిన్‌ నీవు రచింపు దీని నతి విస్తారంబుగా బుత్రకా!

భాగ. 2-212

పై పలుకులవలన భాగవతము భగవంగునిచే రచింపబడినదని తెలియుచున్నది. ఆ సమయముననే ఇంకను బ్రహ్మదేవుడు భగవంతుని దశావతారములను గూర్చి నారదునకు దెలుపుచు. ''భగవంతుండు వర్తమానంబున పరశురా మాద్యవతారంబుల దాల్చి యున్న వాడు. భావికాలంబున రామాద్యవతారంబుల నంగీకరింపగల'' డని తెలిపెను. అనగా ఈ బ్రహ్మ పలుకులు త్రేతాయుగము నాటివి. అప్పుడు బ్రహ్మ నారదునకు భాగవతమును తెలపెను.

ద్వాపరయుగము దీరు సమయంబున వ్యాసుడు జనించెను. స్త్రీశూద్రాదులకు వేదంబులు విన నర్హంబులుగావు కావున మూడులకెల్ల మేలగునని భారతాఖ్యానము రచించెను. అట్టి భూతహిత మొనర్చియు వ్యాసుని మనస్సు శాంతి పొందలేదు. వ్యాకులచిత్తుడై యున్న తరి నారదు డరుదెంచి భక్తి భరితమైన భాగవతపురాణము వ్రాయుమని ఆదేశించెను. వ్యాసుడట్లు భాగవత పురాణమును వ్రాసి శాంతిని పొందెను.

పై కథ ననుసరించి వ్యాసుడు భారతమును రచించిన తరువాతనే భాగవతమును రచించెనని తెలియుచున్నది. భారతములోనున్న భగవద్గీత భాగవతముకంటె ముందుగ వ్రాయబడినది. కాని బ్రహ్మ భగవద్విరచితమైన భాగవతమును త్రేతాయుగమున నారదున కుపదేశించుటయు. వాసుదేవుడైన సంకర్షణమూర్తి పూర్వము సనకసనందనాదుల కుపదేశించుటయు, అట్లు ఋషిసంప్రదాయానుగతమైభాగవతము విస్తరిల్లుటయు బాగవతముననే చెప్పబడియున్నది. కావున భాగవతము భగవత్ప్రోక్తమనియు, ఋషి సంప్రదాయానుగమై వృద్ధి చెంది పౌరాణికులైన ఋషులచే ఇతరులకు బోధింపబడుచుండెననియు లిఖితపూర్వకముగా మాత్రమే (Compilation) తొలుత వ్యాసుడు రచించెననియు చెప్పటకు వీలగుచున్నది. ఉదాహరణమునకు వేదము లోని వృతాసురవధ భాగవతమున కలదు. దాని అంతరార్థము ఋషులనుండి గ్రహించితినని వ్యాసుడే భారతమున చెప్పెను. కాబట్టి భాగవత-భగవద్గీతలు ఉపనిషత్తులవలె పురాతనములైనవని భావించుటకు వీలగుచున్నది.

పురాణము లెందుకు వ్రాయబడెను

పురాణములు ''నిగమార్థసార విచారములు. '' వేదములోని రహస్యములను కథల మూలకముగా తెలియజెప్పుట పురాణముల ముఖ్యోద్దేశము. అందువలన పురాణముల పఠించునప్పుడు కథావస్తువు నకు ప్రాధాన్యత నాపాదింపక ఆ కథచే ఉద్దేశింపబడిన వేదవాక్కును గమనింపవలయును. పాశ్చాత్య విద్యా ప్రాబల్యమువలన హేతు వాదము కుతర్కముల నుపయోగించి, పురాణము లభూతకల్పనలని విమర్శించుట తగదు. ''ధర్మంచర'' అను వేద వచనమునకు కౌరవ పాండవులకథ యైన భారతము నిదర్శనము. ''సత్యంవద'' అను వేద వాక్కునకు హరిశ్చంద్రోపాఖ్యానము నిదర్శనము. భాగవతము ''నిగమార్ధసార విచార'' మనియు, భారతము ''వేదార్థమలచ్చాయ'' మని ఆ పురాణములలోనే తెల్పబడినది.

వేదములు ఉపనిషత్తులు దురవగాహములగుటచేత వానియందలి సత్యవచనములను సుబోధ మొనరించుటకు వానికి వ్యాఖ్యానములు వెలసినవి. పురాణములు ఇతివృత్త ఉదాహరణ కథారూపములవెలసి వేదార్థవిజ్ఞానదాయకము లగుచున్నవి. పురాణములు సుహృద్వాక్యములనగా స్నేహితులవలె మనకు వేదము నందలి అధ్యాత్మికతత్త్వమును సుబోధ మొనరించుచున్నవి. వేదములు ప్రభసమ్మితములై రాజుల వలె ఆజ్ఞాపించుచున్నవి కావ్యములు కాంతా సమ్మితములై ప్రేమ పూరిత అనునయ వాక్కులచే బోధించుచున్నవి భాగవత పురాణమే పంచమవేద తుల్యమని చెప్పబడినది.

కం|| నిగమములు వేయి చదివిన

é సుగమంబులు కావు భక్తి సుభగత్వమునన్‌

నుగమంబు భాగవతమను

నిగమంబు బఠింప...... భాగ. 1-140

పురాణ వాఙ్మయ ప్రాశస్త్యము

పామరులు గ్రహించుటకు సులభ సాధ్యముకాని వేదోపనిషత్తుల పరమార్థమును కథలు ఉపాఖ్యానములమూలమున తెలియజెప్పి రామాయణ భారత భాగవతములు అర్థకామ మోక్షములను పురుషార్థములను ధర్మబద్ధముగా సాధించుటకు మార్గములను సూచించుచున్నవి. భాగవతము మహాపురాణము; భారతము మహేతిహాసము; రామాయణము మహాకావ్యము; సాధారణముగా ఈ మూడింటిని పురాణములని అందురు. వీనిని అధ్యాత్మికతత్త్వమునకు మూల కందములనవచ్చును. శ్రుతిస్మృతి పురాణముల కేకవాక్యతకలదు. కావున పురాణములు వేద తుల్యములను ప్రశంసావాక్యములు అనేకములు కలవు.

1. పురాణములు పంచమవేదమని ఛాందోగ్యమున చెప్పబడినది.

'ఇతిహాస పురాణం పంచమం వేదానాం వేదానాం వేదమితి'

2. సమస్త వేదములు పురాణముల యందే నిస్సంశయములుగా ప్రతి ష్ఠితములై యున్నవని స్కాందపురాణమున చెప్పబడినది.

'వేదాః ప్రతిష్ఠితా స్సర్వే పురాణ నాత్ర సంశయః'

3. భగవంతునకు శ్రుతి స్మృతులు నేత్రములని పురాణములు హృద యమని దేవీభాగవతము శ్లాఘించినది.

'శ్రుతిస్మృతి ఉభౌ నేత్రే పురాణం హృదయంస్మృతమ్‌'

4. వేదములు పురాణములు పరబ్రహ్మయొక్క నిశ్వాసమని వాజప నేయ బ్రాహ్మణోపనిషత్తు వచించుచున్నది.

'అన్యమహతో భూతన్య నిశ్వసితమేత ద్య దృగ్వేదో యజుర్వేద స్సామవేదోధర్వాంగిరస ఇతిహాస పురాణమ్‌'

5. పురాణమర్మము లెరిగినవారు ''ఎందరో మహానుభావు'' లని త్యాగ రాజు అట్టి మహానుభావులకు నమస్కరించెను.

పై అంశములవలన పురాణములు వేదములు ప్రతిరూపములే యనవచ్చును.

పురాణ నిర్వచన మేమి:

''పురాభవ మితి పురాణమ్‌'' ''ప్రావృత్త కథనమమ్‌ పురాణమ్‌'' ఇత్యాది పురాణ నిర్వచనములన్నియు పురాణము ప్రాచీన ఇతివృత్తకథనమేయని ఏకాభ్రిప్రాయమును వెల్లడించుచున్నవి. కాని ప్రాతవయ్యును పురాణములు నిత్య నూతనములని యాస్క నిర్వచనము ''పురానవం భవతి పురాణమ్‌'' - యాస్కనిరుక్తము. ఈ నిర్వచనము వలన పురాణధర్మము లన్నికాలములకు వర్తించునని చెప్పవచ్చును.

పురాణ విభజనము:-

పురాణములు

మహాపురాణములు ఉప పురాణములు

స్వాతిక రాజసిక తామసిక

పురాణములు పురాణమలు పురాణములు

పురాణములు ద్వివిధములు 1) మహాపురాణములు 2)ఉపపురాణములు. మహాపురాణములు పది లక్షణములు కలిగి యుండునని భాగవతమున చెప్పబడినది.

శ్లో|| సర్గోస్యాధవిసర్గశ్చ వృత్త రక్షాంతరాణిచ

వంశో వంశానుచరితం సంస్థాహేతు రపాశ్రయః

దశభి ర్లక్షణౖ ర్యుక్తం పురాణం తద్విదో విదుఃé

కేచి త్పంచనిధం బ్రహ్మన్‌ మహదల్ప వ్యవస్థయా ||

1) సర్గము్ససృష్టి; 2)విపర్గము్సప్రజాపతులసృష్టి; 3)వృత్తి్సఆహారాది సాధనము; 4) రక్ష్సదుష్టశిక్షణకై అవతారములు 5) మన్వంతరము్సమనువుల చరిత్ర; 6) వంశము్సదేవయోనుల బ్రహ్మర్షుల గోత్రానుక్రమము; 7) వంశానుచరితము్ససూర్యవంశ చంద్రవంశ రాజుల చరిత్రము; 8)సంస్థ్సప్రళయము; 9) హేతువు్సజీవునిగూర్చినది; 10) అపాశ్రయము్సభగవంతుని సాక్షిత్వము

ఇవి పురాణ దశలక్షణములు. ఇట్టిపురాణములను మహాపురాణము లందురు. మహాపురాణమలు 18. వీనిని వ్యాసుడు రచించెనని భారతమున చెప్పబడినది.

''అష్టాదశ పురాణానాం కర్తా సత్యవతీసుతః''

ఉపపురాణముల సంఖ్య కూడ 18 అని కూర్మ పురాణమున చెప్పబడినది.కాని అనేకములు కానవచ్చుచున్నవి. నరసింహ, నం దీశ్వర, నారద ఇత్యాది ఉపపురాణములు 26 పేర్కొనబడినవి. ఉప పురాణ లక్షణములైదు.

శ్లో|| సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ

వంశానుచరితం విప్ర పురాణం పంచలక్షణమ్‌

ఏత దుపపురాణానాం లక్షణంచ విదు ర్బుధాః||

బ్రహ్మవైవర్తపురాణము

పురాణములు సృష్టివిద్యను గూర్చి తెలుపునా?

మహాపురాణముల లన్నియును బ్రహ్మాండ సృష్టి విద్య యని Sri Ram Narayan Vyas తెలిపిరి. బ్రహ్మ పురాణముతో లేక బ్రహ్మతో మొదలై బ్రహ్మండవురాణము లేక బ్రహ్మాండ సృష్టితో అంతమగునట్లు 18 పురాణములు వరుసగా కలవు.

"Does it not connote that the puranas deal with 'Sristividya' or the Creaton-lore which gives us the knowledge begining with 'Brahma' or Creator and ending with 'Brahmananda' or Creation?"

-The synthetic Philosophy

of the Bhagavatha.

మాయాశక్తి లేక ప్రకృతి సత్త్వరజస్తమో గుణములచేత సృష్టిస్థితి లయములను చేయుచున్నది.

''సత్వం రజస్త మ ఇదతి గుణాః ప్రకృతి సంభవాః''

భగవద్గీత14-5

బ్రహ్మదేవుడు వేదముల సహాయమున సృష్టిని జరిపెను. సృష్టివిద్య అగు వేదములు గూడ త్రిగుణాత్మకములే.

'' త్రైగుణ్య విషయా వేదాః''

భగవద్గీత 2-45

యజుర్వేదము సాత్వికము; ఋగ్వేదము రాజసము ; సామవేదము తామసము.

మానవుడును త్రిగుణాత్మకుడే. స్థూలదేహము తమోగుణ జనితము ; సూక్ష్మదేహము రజోగుణజనితము ; కారణదేహము సత్త్వగుణ జనితము ; త్రిగుణములకు పరమైనది ఆత్మ.

మంత్రములు గూడ త్రిగుణాత్మకములే. శంకరుడు రచించిన ప్రపంచసార తంత్రమున మంత్రములు ఇచ్ఛా (రజోగుణము) జ్ఞాన (సత్వగుణము) క్రియా (తమోగుణము) శక్తులుగల మూడు తెగలకు చెందినవని చెప్పబడినవి. ఉదాహరణమునకు శ్రీ మదష్టముఖ గండభేరుండ జ్వాలానృసింహ మంత్రము తమోగుణ ప్రధానమైనది. దానిని 16 భాగములుగా విభజించిన 151/2భాగము తమోగుణము 1/4భాగము రజోగుణము, 1/4 భా. సత్వగుణము - మొత్తము 151/2+1/4+1/4=16 భాగములు. నారాయణ అష్టాక్షరి, శివపంచాక్షరి ఇత్యాది మంత్రములు సత్వగుణ ప్రధానములు.

సృష్టిస్థితి లయములను జరుపు త్రిమూర్తులుకూడ త్రిగుణాత్మకులే. బ్రహ్మ రజోగుణాన్వితుడు. విష్ణువు సత్వగుణాన్వితుడు. శివుడు తమోగుణాన్వితుడు. ఇట్లే సృష్టిలో అన్నియు త్రిగుణాత్మకములే అందువలన వేదములకు ప్రతిరూపములైన పురాణములుకూడ త్రిగుణాత్మకములై సాత్విక, రాజసిక, తామసిక పురాణములుగా విభజింపబడినవి. అవి సృష్టివిద్యనే సూచించుచున్నవి.

1. సాత్విక పురాణము లారు.

శ్లో|| వైష్ణవం 1) నారదీయంచ 2) తథాభాగవతం శుభం 3) గారుండంచ 4) తథాపాద్మం 5) వరాహం 6) శుభదర్శనే సాత్వికాని పురాణాని విజ్ఞేయాని శుభానివై.

2. రాజస పురాణము లారు.

శ్లో|| బ్రహ్మాండం 7) బ్రహ్మవైవర్తం 8) మార్కండేయం 9)తధైవచ భవిష్యం 10)వామనం 11) బ్రహ్మం 12) రాజసాని నిబోధతే.

3. తామస పురాణము లారు.

శ్లో|| మాత్స్య 13) కౌర్మం 14)తథాతైంగం 15)శైవం 16)స్కాందం 17) అగ్నేయంచ 18) షడేతాని తామసాని నిబోధమే.

మొత్తము మహపురాణములు 18. సాత్విక పురాణములారును విష్ణువును కీర్తించును. రాజస పురాణము లారును బ్రహ్మను వినుతించును. తామస పురాణము రారును శివుని స్తుతించును. దీనిని బట్టి భాగవతము సాత్వికమైన మహాపురాణమనియు దశలక్షణ సమన్విత మనియు విదితమైనది.

7 భాగవతము పురాణమ వేదార్థసారము.

''జన్మాద్యస్య యతః'' అను బ్రహ్మసూత్రముతో భాగవతము ప్రారంభ##మై, వేతాంతరహస్య ప్రతిపాదకమై, నిగమార్థసారమై వెలయుచున్నది. వ్యాసుడు వేద రహస్యములను కథల మూలమున వవిరించెను.

శ్లో|| నిగమ కల్పతరో ర్గళితం

శుకముఖా దమృత ద్రవ సంయుతం

పిబత భాగవతం రసమాలయం

ముహురహో! రసిక భావి భావుకాః!

సంస్కృత భాగవతము.

గీ|| వేద కల్పవృక్ష విగళితమై, శుక

ముఖ సుధాద్రవమున మొనసియున్న,

భాగవత పురాణ ఫల రసాస్వాదన

పదవి గనుడు. రసిక భావ విదులు.

ఆంద్ర భాగవతము 1-37

వేదకల్పవృక్ష ఫలముగా భాగవతము భావింపబడినది. చిలుక కొరికిన పండునకు తీపి ఎక్కువ. భాగవతము శుకునిచే గానము చేయబడినది. శుక మనగా చిలుక యని ఒక అర్థము. వృక్షములోని భాగములలో దాని ఫలమే ఆస్వాదయోగ్యము. వేదములు దురవగాహము లగుటచేత వేదకల్పవృక్ష సారము ఆస్వాదయోగ్యమగు భాగవత ఫలరూపమున అందజేయబడినది. ఆస్తిక్య భావమంతరించి భక్తి నశించుచున్న కలికాలమున మానవ కల్యాణమునుగోరి వేద వేదాంగ రహస్యములను సువిదితము సేయుటకై ఋషిసంప్రదాయాను గతమైన భాగవతామ్నాయమును వ్యాస భగవానుడు రచించెను.

శ్రుతిస్మృతి పురాణోక్తమైనది హిందూధర్మము:-

హిందూమతములోని ప్రతి ధర్మము శ్రుతిస్మృతి పురాణోక్తముగా గమనింపవలయును. వేదములును. వాని అర్థములను వివరించు పురాణములును. పరస్పర విరుద్ధములుకావు. వానికి ఏకవాక్యత కలదు. మనస్సు చేతను వాక్కు చేతను అందరాని సమాధిస్థితిలో ఋషులు వేద ఋక్కులను దర్శించి మంత్రద్రష్టలైరి. అందువలన ఋక్కులు పరమ సత్యములు. వాని ఆధ్యాత్మిక సత్యమును మానసిక మైన తార్కిక చాతురితో (కుతర్కవాదముతో) విమర్శించుటకు వీలు పడదు. అవి మనస్సును దాటి ఆత్మానుభవముతో చెప్సబడిన వగుట చేత అనుభ##వైక వేద్యములు. కాబట్టి సంప్రదాయ సిద్ధమైన శ్రుత్యసు కూలతర్కము చేతనే వేదములను విమర్శింపవలయును. ఈ వేదములను పురాణములు వివరించును. అందులకే భారతమున ఇతిహాసపురాణముల సారమును. గ్రహించి వేదార్థములను వివిరింపవలెననియు తెలుపబడినది.

''ఇతిహాస పురాణాభ్యాం వేదం స ముపబృంహయేత్‌.''

-భారతము

8 భాగవతము మోక్షగ్రంథము.

పురాణములు సాధారణముగా ధర్మఅర్థకామ మోక్షములను చతుర్విధ పురుషార్థములను సిద్ధింపజేయుట కుద్దేశింపబడినవి. భారత పారిజాతము ''సుమహావర్గచతుష్క పుష్ప వితతిన్‌'' శోభిల్లుచున్నది. అనగా నాలుగు పురుపార్థములను పుష్పములుగా కలది. రామాయణ కల్పవృక్షము ''ధర్మకామార్థ సహితము''. కాని భాగవతము కేవల మోక్షగ్రంథము. తొలుతనే పోతన ''శ్రీకైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్‌'' అని చెప్పుకొనెను. ఏడు దినములలో మోక్షమును బొందగోరిన పరీక్షిత్తు అర్థకామముల సన్యసించి భాగవత ధర్మము నవలంబించి మోక్షమునే ఆశించెను. కావున భాగవత కల్పవృక్షము ''మహా ఫలంబు'' మోక్షఫలము నిచ్చునది.

9 భాగవతము సాత్వత సంహిత:

భాగవతము సాత్వికపురాణమని ముందుగా తెలిసికొన్నాము. ముక్తినిగోరిన పరీక్షిత్తునకు జీవన్ముక్తుడైన శుకుడు బ్రహ్మజ్ఞానమును భాగవతరూపమున ఉపదేశించెను. అందువలన భాగవతము-పారమ హంస్యము, సాత్వత సంహిత అను పేర్లను పొందగలిగెను. పూర్వము బ్రహ్మ సృష్టి యొనర్చుటకై తప మొనర్చెను. పరమేశ్వరుడు ప్రత్యక్షముకాగా ''నీ తత్త్వముపదేశింపు'' మని కోరెను. పరమేశ్వరుడు హయగ్రీవరూపమున తత్తత్వమును నాలుగుశ్లోకములలో ఉపదేశించెను. ఈ తత్త్వము భగవంతుడు చెప్పుటచేత భాగవతమైనది. హయగ్రీవుడుపదేశించుటచేత హయగ్రీవ బ్రహ్మవిద్య అని పేరు గాంచినది. భాగవతములోని ద్వాదశ స్కంధములలో వాసుదేవ ద్వాదశాక్షరి ఇమిడియున్నదని పెద్దలందరు.

శ్లో|| అనర్థోపశమం సాక్షా ద్భక్తి యోగ మధోక్షజే

లోకశ్చా జానతో విద్యాం శ్చ క్రే సాత్వత సంహితామ్‌||

అనర్థ నివారణోపాయమగు భగవంతుని యందలి భక్తి యోగమును సాత్వత సంహితరూపమున విద్వాంసుడు ఆజ్ఞానియగు లోకము కొఱకు నిర్మించెను.

రజస్తమోగుణ పరిహారిణియగు భాగవత ప్రతాపాదిత భక్తి సిద్ధించిన తరువాత శుద్ధసత్వగుణ మేర్పడును.

శ్లో|| సత్వాత్‌ సంజాయతే జ్ఞాసం

భక్త్వాజ్ఞానం ప్రజాయతే. భగవద్గీత 14-17

అందువలననే భాగవతములోని ముఖ్యపాత్ర లన్నియు సత్వగుణ ప్రధానములై యున్నవి. విశేష మేమనగా తొట్ట తొలుత భాగవతమున మన ముందుకు రాబడిన పాత్ర ద్రౌపది.ఈమె ''సుస్వభావ'' సత్వగుణ ప్రధానురాలు. తన కుమారులైన ఉప పాండవుల జంపిన అశ్వత్థామకు నమస్కరించి అతని క్షమించిన అత్యంత సత్త్వమూర్తిగా చిత్రింపబడినది. భారతమున నాయకురాలైన ద్రౌపది దీనికి విరుద్ధముగా తమోగుణ ప్రధానురాలు. ప్రతిక్రియా రూపమున అశ్వత్థామచావును కోరినది. ఈ భారత భాగవత కథలను తరువాత వివరింతును.

భాగవత సంప్రదాయము:

నారాయణుడు

బ్రహ్మ శేషుడు

నారదుడు సనత్కుమారుడు

వ్యాసుడు సాంఖ్యాయనుడు

శుకుడు పరాశరుడు

పరీక్షిత్తు, సూతుడు మైత్రేయుడు

శౌనకాదులు విదురుడు

భాగవతము ''భగవత్ప్రోక్తము; ఋషిసంప్రదాయానుగతము; పురుషోత్తమ స్తోత్రము ; పరమ పవిత్రము ; భవలతాలవిత్రము'' గా ఒప్పుచున్నది. భాగవతమును తొలుత శ్రీమన్నారాయణుడు బ్రహ్మకును, బ్రహ్మ నారదునకును, నారదుడు వ్యాసునకును, వ్యాసుడు శుకునకును. శుకుడు పరీక్షిత్తునకును సూతునకును, సూతుడు శౌనకాది మహామునులకును తెలిపిరి. వేరొక సాంప్రదాయము ప్రకారము శ్రీమన్నారాయణుడు శేషునకును. శేషుడు సనత్కుమారునకును సనత్కుమారుడు సాంఖ్యాయనునకును. సాంఖ్యాయనుడు పరాశరునకును, పరాశరుడు మైత్రేయునకును, మైత్రేయుడు విదురునకును, తెలిపిరి. వేరొక సాంప్రదాయములో తొలుత 4 శ్లోకముల పరిమితి గల భాగవతమును శ్రియఃపతి చతుర్ముఖ బ్రహ్మ కుపదేశించెను. చతుశ్ల్శోకీ భాగవతమును విస్తరించి సంకర్షణస్వామి సప్తాహశ్రవణ విధానముతో సనత్కుమారాదుల కుపదేశించెను. వారుకూడ నారదున కుపదేశించిరి. కావున నారదుడు సంక్షిప్త చతుశ్ల్శోకీ భాగవతమును. శేషభగవానుని కృతమైన విస్తీర్ణభాగవతమును, -రెండింటిని ఆలకించెను. తరువాత నారదుడు వ్యాసున కుపదేశించెను, ఈ విధముగా సంక్షిప్తభాగవతము భగవదవతార కథలతోను, భాగవతుల కథలతోను విస్తరించినది.

10 సంక్షిప్త భాగవతము

నారాయణుడు బ్రహ్మదేవునికి క్రింది 4 శ్లోకములు సంక్షిప్త భాగవతరూపమున తెలిపెను.

1 శ్లో|| అహమేవా సమే కో7గ్రే నాన్యద త్సదసత్‌ పరమ్‌

పశ్చాదహం యదేతచ్చ యో7వశిష్యత సో7స్మ్యహమ్‌ ||

సృష్టికి పూర్వము నేనొక్కడనే యుంటిని. స్థూలసూక్ష్మ ప్రపంచముగాని వానికి కారణమగు ప్రకృతిగాని వేరొకటి నాకంటె భిన్నమైనదిలేదు. ఉండుట లేకుండుటలేదు. కార్యము కారణము నేనే. నీవు తెలియదగినది చూడదగినది నేనే. నాయందు లేని దేదియు లేదు. నేనుతప్ప నీకు గోచరించు ఇతరమంతయు మాయ.

2) శ్లో|| ఋతే7ర్ధం యత్ప్రతీయేత్‌ నప్రతీయేత చాత్మని

తద్విద్యా దాత్మనో మాయాం యథాభానో యథా తమః ||

é ఒక వస్తువునకు ప్రతింబమువలె, వెలుగునకు చీకటివలె నీవు నాయందున్నను నీయందు మాయ దోచును. లేని యర్థము భాసించుటకు ఉన్న యర్థము తోచకపోవుటకు కారణము నామాయ అని తెలియుము.

3) శ్లో|| యథా మహాంతి భూతాని భూతే మాచ్చావ చేష్యసు

ప్రవిష్టాస్య ప్రవిష్టాని తథాతేషు నతేష్వహమ్‌ ||

మహా భూతములు భౌతిక పదార్థము లప్రవిష్టము లవైనను ప్రవిష్టములైన తోచునట్లు భూత భౌతిక పదార్థములందు నేనుంటిని.

4) శ్లో|| ఏతావదేవ జిజ్ఞాస్వం తత్త్వజిజ్ఞాసు నా7త్మనః

అన్వయ వ్యతిరేకాభ్యాం యత్స్యాత్సర్వత్ర సర్వదా ||

భాగవతము 2-9-33,34.35.36.

తత్త్వ జిజ్ఞాసువగువాడు అన్వయ వ్యతిరేకముచేత నెల్ల చోటుల నెల్లకాలము నేదియుండునో అదియే ఆ త్మస్వరూపమని తెలియవలయును.

అన్వయ మనగా కార్యముల యందు కారణరూపమున అను వర్తనము జాగ్రదా ద్యవస్థాత్రయమునందు సాక్షిరూపమున అనువర్తినము. వ్యతిరేకమనగా కారణావస్థయందు వానికంటె వ్యతిరేకముగా నుండుట. సమాధ్యాదులయందు జాగ్రదాదులకంటె వ్యతిరేక ముగా నుండుటయే వ్యతిరేకము.

పై శ్లోకార్థములను పరిశీలించినచో భాగవతము అద్వైత సిద్ధాంతమును సమర్థించుచున్నదని తోపక మానదు.

11 వ్యాసమహర్షి భాగవతము నెందులకు వ్రాసెను

వ్యాసుడు సామన్య మానవుడు కాదు. కారణ జన్ముడు.

'వ్యాసాయ విష్ణు రూపాయ'

శ్లో|| ఆచతుర్వదనో బ్రహ్మ ద్విబాహు రపరోహరిః

అఫాలలోచన శ్శంభుః భగవాన్‌ బాదరాయణః ||

వ్యాసుడు భగవదవతారమని పై శ్లోకము సూచించు చున్నది. వ్యాసుని జన్మరహస్యము భవిష్యోత్తర పురాణము వివరించినది.

వసురాజు వేటాడుచు వసంతకాల మగుటచేత తన భార్యను మరువలేక తన వీర్యమును డేగచేత ఆమెకు పంపెను. ఆ డేగ వేరొకడేగతో పోట్లాడగా ఆవీర్యము యమునానదిలో పడెను. ఆర్ద్రిక అను అప్సరస చేప రూపమున నుండి దానిని కబళించెను. గర్భముధరించి ప్రసవించు సమయమున బెస్తవానికి దొరికెను. ఆమె కడుపునుండి కవలపిల్లలు పుట్టిరి. పురుష శిశువును ఉపరిచరుడను ఆ రాజు పెంచెను. ఆడపిల్లను చేపలుపట్టు బెస్తవాడే పెంచెను.ఆమెయే పద్మగంది లేక సత్యవతి.

పరాశరముని దైవప్రేరితుడై సత్యవతిని కాంక్షించెను. ఓడలో ఉన్నప్పుడు మంచును సృష్టించి ఆమెను ఆలింగనము చేసికొనెను ఆమె సద్యోగర్భము ధరించి తక్షణమే యమునలోని ఒక ద్వీపములో బాలుని కనెను. అతడే వ్యాసుడు. కావున వ్యాసుడు కారణజన్ముడు పై కథకు ఏదో అంతరార్థము ఉండవలయును.

సీ|| అరవిందనాభుని యవతారమై

జననమందిన పరాశర సుతుండు

చతుర వర్ణాశ్రమాచార ధర్మంబులు

ఠవణింప లోక విడంబనంబు

లగు గ్రామ్యకథలు పెక్కర్థిగల్పించుచు

హరికథా వర్ణన మందులోన

నించు కించుక గాని ఏర్పడ జెప్పమి

సంచిత విజ్ఞాన మాత్మ నిలువ

గీ|| కున్న. జింతించి మరి నారదోపదిష్టు

డగుచు, హరివర్ణనామృత మాత్మగ్రోలి

విమల సుజ్ఞాన నిధియని వినుతికెక్కి

ధన్యుడయ్యెను లోక్తెకమాన్యుడగుచు.

భాగ. 3-190

కామాద్యరిషడ్వర్గముల లయము శాంతి యనబడును. ''శాంతము లేక సౌఖ్యములేదు'' (త్యాగరాజు). పదిహేడు పురాణములు వ్రాసియు వ్యాసుడు వ్యాకులచిత్తుడై శాంతిని పొందలేదు. భిన్నుడై నారదునాశ్రయించెను. నారదుడు అనుభవ పూర్వకముగా తన జీవితకథను వివరముగా జెప్పి

1) నిర్గత కర్మంబును నిరుపాధికంబైన జ్ఞానము హరిభక్తి లేకున్న

శోభితంబుగాదు

2) భక్తి హీనములైన జ్ఞాన వాచా కర్మ కౌశలంబులు నిరర్థకంబులు.

అని తెలిపెను. (భాగవతము 1-98)

అనగా భక్తిలేని కర్మధ్యాన జ్ఞానములు నిష్ఫలములు. ''భక్తి వినా సన్మార్గము కలదే'' యని త్యాగరాజు పాడెను; వాచావేదాంతము నేర్చుకొని ''వేదాంత వాక్య నికురుంబముచే'' ఊరక చెడిపోదురని సీతా రామంజనేయ సంవాదమున చెప్పబడినది. నిర్గుణోపాసన కష్టమని భగవద్గీతయు సూచించినది.

శ్లో|| క్లేశోధికతర స్తేషా మవ్యక్తాసక్త చేతసామ్‌ ||

గీత 12-5

కావున భక్తి రసభరితమైన భాగవతమును వ్రాయుమని నారదుడు వ్యాసునకుపదేశించెను. ఇదిగాక నారదుడు వ్యాసునిట్లు మందలించెను

''కామ్యకర్మంబుల రాగంబుగల ప్రాకృత జనులకు నియమించిన ధర్మంబులు (భారతమున) సెప్పి శాసకుండవగు నీ నడవడితగదు. అది ఎట్టలనిన వార లదియ

ధర్మంబని జుగుప్సితంబులగు కామ్య కర్మంబుల సేయుచు తత్త్వజ్ఞానంబు మఱతురు.''

భాగవతము 1-98

కేవల నిష్కామబుద్ధితో విధ్యుక్త చాతుర్వర్ణ్యాది కర్మలను ఆశ్రమకర్మలను ధర్మమని ఆచరించినను ''కులధర్మగౌరవము సిద్ధి వహింపదు'' కులధర్మమును విడచియైనను దానవవైరి పదారవిందముల నాశ్రయించవరెను.

చ|| తన కులధర్మమున్‌ విడచి దానవవైరి పదారవిందముల్‌

పనివడి సేవ సేసి పరిపారకము జెందక ఎవ్వడేని జు

చ్చిన మఱుమేన నైననది సిద్ధి వహించు; దదీయ సేవ బా

సిన గులధర్మ గౌరవము సిద్ధివహించునె ఎన్ని మేనులన్‌.

భాగవతము 1-100

ఈ జన్మలో కులధర్మము విడచి మాధవసేవ యోనర్చి సిద్ధినిపొందని ఎడల మఱుజన్మనైన సిద్ధిని పొందును. మాధవసేవను వదలి కేవల కులధర్మాచరణ మొనర్చిన ఎన్నిజన్మలకును సిద్ధిని పొందజాలడు.

ఇంకను నారదు డిట్లనెను-

''హరి వర్ణనంబు సేయక ప్రకారాంతరంబున అర్దాంతరంబులు వివక్షించి తద్వివక్షాకృత రూప నామంబులం జేసి పృథగ్దరశనుండైన వాని మతి పెనుగాలిచేతం ద్రిప్పబడి తప్పంజను నావ చందంబున నెలవు నేరదు'' -భాగవతము 1-98

ఇతర మార్గములైన కర్మ ధ్యాన జ్ఞానముల ననుసరించినను హరివర్ణనము సేయనిచో ఆ మార్గములు గమ్యమును చేర్చలేవు. ఇట్లు నారదు డుపదేశింపగా వ్యాసుడు హరివర్ణనగల భాగవతమునురచించి ధన్యుడయ్యెను.

ఇది గాక కలియుగమున జనులు సుకర్మములు సేయ జాలరు. కలిదోషనివారణమునకు సులభోపాయము హరికథను వినుటయే.

చ|| అలసులు మందబుద్ధిబలు లల్పతరాయువు లుగ్రరోగ సం

కలితులు, మందభాగ్యులు సుకర్మము లెవ్వియుజేయజాల రీ

కలియుగమందు మానవులు గావున నెయ్యది సర్వసౌఖ్యమై

యలవడు? నేమిటం బొడమునాత్మకు శాంతి? మునీంద్ర చెప్పవే

భాగవతము 1-44

క|| కలిదోష నివారణమై

(వెలయు) హరికథనము భాగవతము 1-47

12 పోతన భాగవతము నెందుల కాంధ్రీకరించెను?

ఈ ప్రశ్నకు పోతనామాత్యుడే జవాబు చెప్పెను.

ము|| ఒనరన్‌ నన్నయ తిక్కనాది కవు లీ యుర్విన్‌ పురాన్‌ పురాణావళుల్‌

తెనుగుం జేయుచు మత్పురాకృతశుభాధిక్యంబు తానెట్టిదో

తెనుగుం జేయరు మున్న భాగవతమున్‌! దీనిం దెనింగించి నా

జననంబున్‌ సఫలంబు చేసెద వునర్జన్మంబపు లేకుండగున్‌.

భాగవతము 1-21

తిక్కనాది కవులు భాగవతము నాంధ్రీకరింపలేదు. ఇందులకు కారణము తాను పూర్వజన్మలో చేసిన సత్కర్మ ఫలమేనని పోతన భావించెను. శంకరాచార్యులు కూడ సౌందర్యలహరిని వ్రాయు నప్పుడట్లే భావించెను.

''ఆతస్వామారాధ్యాం హరిహర విరించ్యాదిభి రపి

ప్రణంతుం స్తోతుం వా కథం మకృత పుణ్యః ప్రభవతి.''

అని దేవిని గూర్చి చెప్పికొనెను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే స్తుతింపబడు శక్తిని తాను కీర్తింపబూనుటకు తన పూర్వజన్మపుణ్యమే కారణమని భావము. అందువలన భాగవతాంధ్రీకరణము పోతన గారి ''పురాకృత శుభాధిక్యంబు'' వలననే జరిగిన దనవచ్చును. పోతన భాగవతము నాంధ్రీకరించుట కూడ ఆంధ్రుల యదృష్టమే యని చెప్పవచ్చును.

భాగవతాంధ్రీకరణ ఫలము జన్మసాఫల్యము., పోతన భాగవతము నాంధ్రీకరించి జననంబున్‌ సఫలంబు జేసెద వనెను. సామాన్య మానవుడు సహజముగా తన జన్మ సఫల మగుటకు చతుర్విధ పురుషార్థము లైన ధర్మ ఆర్థకామ మోక్షములను కోరును. విశేషమేమనగా పోతన అట్లు కోరక తురీయ పురుషార్థమైన మోక్షము నొక్కదానినే కోరెను, అతనికి జన్మసాఫాల్య మనగా పునర్జన్మ లేకుండుటయే అర్ధకామములు అతడాశించలేదు. భాగవత ధర్మమైన నివృత్తి ధర్మమునే అతడు పాటించెను. శాపగ్రస్తుడైన పరీక్షిత్తు ''సప్తాహంబుల ముక్తికేగెడిగతిన్‌ చర్చించి భాషింపరే'' (1-514) అని ఋషులను వేడుకొనెను. శుకమహర్షి భక్తి మార్గము నవలంబింపుమని యుపదేశించెను. పరీక్షిత్తు అర్థకామముల సన్యసించెను. సప్త భూమికలను ఏడు దినములలో అధిగమించి ముక్తిని పొందెను. అట్లే ''శ్రీ కైవల్యవదంబు జేరుటకునై జింతించు'' పోతనకూడ అర్థకామముల సన్యసించెను. సాధన చతుష్టయ సంపత్తిలో నాల్గవదగు ముముక్షుత్వముకోరెను. అర్థాసక్తి లేక పేదరికమునే అతడు కోరి వరించెననుటకు ఈ క్రింది పద్యము తార్కాణము.

సీ|| కమనీయ భూమి భాగములు లేకున్నవే

పడియుండుటకు దూదిపరుపులేల ?

సహడంబులగు కరాంజలులు లేకున్నవే

భోజన భాజన పుంజమేలః

వల్కలాజిన కుశావళులు లేకున్నవే

కట్ట దుకూల సంఘంబు లేల?

గొనకొని వసియింప గుహలు లేకున్నవే

ప్రాసాద సౌధాది పటలమేల ?

గ్రీ|| #9; ఫల రసాదులు గురియవే పాదపములు ?

స్వాదు జలములు నుండవే సకల నదులు ?

పొ సగ భిక్షము వెట్టరే పుణ్య సతులు ?

ధన మదాంధుల కొలువేల తాపసులకు ?

భాగవతము 2-21

పోతన రాజాశ్రయమును కోరలేదు. సిరిసంపదలు శాశ్వతము కావని భావించెను.

''కారే రాజులు? రాజ్యముల్‌ గలుగవే? గర్వోన్నతిం జేందరే?

వారేరీ? సిరి మూటగట్టుకొని పోవం జాలిరే? భాగ. 8-590

అని ప్రశ్నించుకొనెను. రాజులను అధములుగా భావించెను.

ఉ|| ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి. పురుంబులు వాహనంబులున్‌

సొమ్ములు కొన్ని పుచ్చుకొని, చొక్కి, శరీరమువాసి కాలుచే

సమ్మెట వ్రేటులన్‌ దినక, సమ్మితితో హరికిచ్చి చెప్పె నీ

బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్‌.

భాగవతము 1-13

''నీచాశ్రయో న కర్తవ్యః | కర్తవ్యో మహదాశ్రయః''

అను సూక్తి ననుసరించి రాజాధిరాజు, పురుషోత్తముడు, ''రాజ శేఖరుడు'' నైన శ్రీరామునే ఆశ్రయించి, రాజాధము లిచ్చు సంపదల నాశించుటచే నరకబాధల బడనొల్లక శ్రీరామునకే భాగవతము నంకితము జేసెను. శ్రీరామ భూపాలుని ముం దీరాజు లేపాటివారు

శ్రీ రాముని కూడ సిరిసంపదల నిమ్మని ఏల కోరలేదని అడుగవచ్చును. శ్రీరామ రహస్యోపనిష్యత్తులో హనుమంతుడిట్లు తెలిపెను.

''ఐహికేషుచ కార్యేషు మహా పత్సుచ సర్వాదా

నైవయోజ్యో రామమంత్రః కేవలం మోక్షసాధకః

ఐహికే స మనుప్రాప్తే మాంస్మరే ద్రామసేవకమ్‌'

రామ రహస్యోపనిషత్తు.

''ఆశ్రిత కల్పకమును భగవంతుడును అగు శ్రీరాముని మోక్షఫలము గోరవలెను గాని ఐహికసుఖముల గోరుట వెఱ్ఱితనము. ఐహిక సుఖముల గోరువారు రామసేవకుడైన నన్ను గోరవలెను'' అని హనుమంతుడు తెల్పెను.

దారాసుత ఉదర పోషణార్థమై కర్షకవృత్తి నవలంబినను తప్పుకాదని పోతన భావము.

ఉ|| బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్‌

గూళల కిచ్చి యప్పడువుకూడు భుజించుటకంటె సత్కవుల్‌

హాలికులైన నేమి? గహనాంతర సీమల కందమూల కౌ

ద్దాలికులైన నేమి? నిజదార సుతోదర పోషణార్థమై.

ఐహిక సుఖములను పోతన ఆశించలేదు. కావ్యకన్యక నంకితము చేసిన లంభించు సంపదను పడుపుకూడగ భావించి సత్కవి యని పించుకొనెను. పోతన సత్కవితను గూర్చి వసురాయకవి ఇట్లు ఆశ్చర్యమును వ్యక్తపరచెను.

సీ|| రాజ రాజేంద్ర సామ్రాజ్య భోగములందు

నన్నయభట్టు పాల్గొన్నవాడు

మనుమసిద్ధీశ క్షమా చక్ర మరుదార

తిక్కన్న తన చేత ద్రిప్పినాడు

వీరభద్రారెడ్డి విరివి¸° విభవంబు

శ్రీనాథ దెంతొ భుజించినాడు,

.... .... .... ....

.... .... .... ....

గీ|| వెఱగు పడనేల వారి కవిత్వమునకు

బ్రతుకుపై యాస కూడను బాడుసేయపు

ఘోర దారిద్ర్య దుఃఖంబు గడుచు చకట

ఏ గతిని బల్కె పోతన్న భాగవతము.

పోతన దృష్టిలో భాగవత కల్పవృక్షము ''మహాఫలంబు''. అనగా మోక్షఫలము నిచ్చునది. భారత పారిజాత మట్లుగాక ''సుమహావర్గ చతుష్క పుష్ప వితతిన్‌'' శోభిల్లునది; అనగా ధర్మఅర్థ కామమోక్షములను చతుర్విధ పురుషార్థముల నిచ్చునది. కాబట్టి కేవల మోక్షార్థికి భాగవతమే పఠనీయ గ్రంథము.

పునర్జన్మ పోతనకు లేదు. భాగవతమునకు లేదు. భారత రామాయణములకు కలిగిన పునర్జన్మ (ఆంధ్రీకరణములు) భాగవతమునకు కలుగలేదు కదా. భక్తితో భాగవతమును చదివినవారికి విన్నవారికి కూడ పునర్జన్మము లేదు.

13 భాగవత పఠనమువలన ఫలమేమి ?

ఈ ప్రశ్నకుకూడ భాగవతముననే సమాధాన మున్నది.

ము|| #9; అవనీచక్రములోన నే పురషు డే ఆమ్నాయమున్‌ విన్న మా

ధవుపై లోక శరణ్యుపై భవములం దప్పింపగాజాలు భ

క్తి విశేషంబు జనించు నట్టి భువన క్షేమంకరంబైన భా

గవతామ్నాయము బాదరాయణుడు తా గల్పించె నేర్పొప్పగన్‌

భాగవతము 1-136

భాగవత శ్రవణమువలనను పఠనములవలనను జన్మరాహిత్యము కలిగించెడి హరిభక్తి లంభించును. అందువలననే భాగవతము ''భువన క్షేమంకరము, '' వేదసారము, ''మహాఫలము'' భాగవతపఠనము వలన కలిగిన ''భక్తి విశేషమే'' అనన్యము, అభేదము, అత్యంతికము అగు సాత్విక భక్తియని భక్తియోగ అధ్యాయమున నిరూపింతును.

14. ఏదృష్టితో భాగవతమును పఠింపవలయును

గ్రంధారంభముననే భాగవతమును తార్కిక దృష్టితో పఠింప రాదని పోతని పాఠకులను హెచ్చరించెను.

చ|| జగ దధినాథుడైన హరి సంతతలీలల నామరూపముల్‌

దగిలి మనోవచో గతుల తార్కికచాతురి ఎంత గల్గియున్‌

మిగిలి కుతర్కవాదముల మేరలు మీరి ఎఱుంగ నేర్చునే

అగణిత నర్తనక్రమము నజ్ఞుడెరింగి సుతింప నేర్చునే ?

భాగవతము 1-70

జగత్తు నామరూపాత్మకమైనది. జగద్విషయములను మనస్సు చేతను వాక్కుచేతను తర్క సహాయమున విమర్శింపవచ్చును.రసాయనాది శాస్త్రములను తర్కము హేతవాదములచేత (Inductive and deductive logic) సాధింపవచ్చును. కార్యకారణములకు మించిన ఆధ్యాత్మ మనబఢు భగవద్విలాసము తర్కమునకు లొంగదు ''యతో వాచో నివర్తంతే అప్రాస్య మనసా సహ.'' మనస్సుచేత గ్రహించుటకు వీలుపడనిది వాక్కులతో వ్యక్త పరచుటకు సాధ్యము కానిది భగనవంతకుని లీల. భావోపేతములైన నాట్యభంగిమల యర్థమును ఆజ్ఞుడు గ్రహింపజాల నట్లే రాసక్రీడలు మొదలగు హరిలీలల పరమార్థమును ఉద్దండుడైన తార్కికుడు కూడ గ్రహింపజాలడు. భాగవతామ్నాయములోని కథా వస్తువును విమర్శించినపుడు అపౌరుషేయములైన వేదములను ప్రమాణముగ స్వీకరించి వేదరహస్యగర్భితములైన శ్రీకృష్ణలీలలను తర్కముపై ఆధారపడక సంప్రదాయ సిద్ధమాన వ్యాఖ్యానమునకు గురుచేయవలయును. శ్రీ కృష్ణుని సామాన్యమానవునిగా భావించుట తగదని భగవద్గీతలోను భాగవతమునను చెప్పబడినది.

''అవజానంతి మాం మూఢాం మానుషీం తను మాశ్రితమ్‌''

భగవద్గీత 9-11

మనుష్య శరీరము ధరించిన నన్ను మూఢులు భగవంతునిగా తెలిసికొనజాలరు.

చ|| జననములేక, కర్మముల జాడలబోక, సమస్త చిత్త వ

ర్తనుడగు చక్రికిం గవు లుదారపదంబుల జన్మకర్మముల్‌

వినుతులు సేయుచుండుదురు; వేదరహస్యములందు ఎందు జూ

చిన మఱిలేవు జీవునికి జెప్పిన కైవడి జన్మకర్మముల్‌

భాగవతము 1-68

జీవునికి జన్మకర్మలున్నవిగాని శ్రీహరికి జన్మకర్మ లున్నట్లు వేదమున చెప్పబడలేదు. వేదరహస్యములను గ్రహించుటకు కథలు కల్పింపబడినవేమౌ! ''భువన క్షేమంకరంబైన

భాగవతామ్నాయము బాదరాయణుడు తా కల్పించె నేర్పొప్పగన్‌''

భాగవతము 1-136

అయినచో వేరొక సందేహము రాకమానదు. తర్కముచే విమర్శించుటకు వీలుకానట్టి, మనస్సున కందనట్టి హరి లీలలను (ఆత్మతత్త్వమును) ఎట్లు గ్రహింపవీలుపడును? ఈ ప్రశ్నకు సమాధానము చూడుడు.

ఉ|| ఇంచుక మాయలేక మదినెప్పుడు పాయని భక్తితోడ వ

ర్తించుచు, ఎవ్వడేని హరి దివ్యపదాంబుజ గంధరాశి సే

వించు,నంతం డెఱుంగు నరవిందభవాదులకై న దుర్ల భో

దంచితమైన యాహరి యుదార మహాద్భుత కర్మమార్గముల్‌

భాగనవతము 1-71

బ్రహ్మ రుద్రాదులకైనను గ్రహించ వీలుకాని విష్ణు లీలలను గ్రహించుటకు ఏకైక మార్గము భక్తిమార్గమేయని భాగవతము చాటి చెప్పుచున్నది. ఈ విషయమునే భగవద్గీత కూడ సమర్థించుచున్నది

శ్లో|| భక్త్యాత్వనన్యయా శక్య అహ మేవంవిథో7ర్జున!

జ్ఞాతుం ద్రుష్టుంచ తత్త్వేన ప్రవేష్టుంచ పరంతప!

భగవద్గీత 11-54

నన్ను జూచుటకుగాని, నిజముగా దెలిసికొనుటకుగాని నన్ను ప్రవేశించుటకుగాని నిశ్చలభక్తి తప్ప వేరు సాధనములు లేవు.

శ్లో|| భక్త్యా భాగవతం జ్ఞేయం న వ్యుత్పత్త్యా న టీకయా.

పాండిత్యముతోను అర్థవివరణములతోను భాగవతమును గ్రహింపజాలరు. భక్తి తోడనే గ్రహింపగలరు. కాబట్టి భక్తిభావముతో భాగవతమును పఠింపవలెను. విమర్షనాత్మక దృష్టితో కుతర్క హేతువాదచాతురితో పఠింపరాదు. అట్టివారికి భవములందప్పింపగాజాలు భక్తి విశేషంబు లభింపదు. భక్తునకు ''బుద్ధి యోగందదామ్యహం'' జ్ఞానమును ప్రసాదింతునని శ్రీకృష్ణుడు గీతలో తెలిపెను భగవనుగ్రహము లేనిదే శ్రీహరి లీలలు బ్రహ్మరుద్రాదులును తెలిసికొనజాలరు. శుద్ధసత్త్వము గలవారికి గాని ఆత్మానుభూతి కలుగదు. రజస్తమో గుణ పరిహారిణి యగు విశేషభక్తి భాగవతము పఠించువారికి లభించి శుద్ధ సత్త్వ మేర్పడును. ఈ సత్త్వగుణమే ముక్తి మార్గము జూపునని భాగవత సందేశము.

''సత్వాత్‌ సంజాయతే జ్ఞానం

భక్త్యాజ్ఞానం ప్రజాయతే'' భగవద్గీత 14-17

15. భాగవత మహాత్మ్యము

శ్రీ మహాభాగవతమాహాత్మ్యము పద్మపురాణ ఉత్తరఖండమున మొదటి ఆరు అధ్యాయములలో వివరింపబడినది.

గీ|| అల్పతరమైన సుఖముల నందుచున్న

జనుల దుఃఖంబు మాన్పంగ జాలునట్టి

పుండరీకాక్షు గుణ కథా ప్రోతమైన

వితత నిగమార్థమగు భాగవతము భువిని.

భాగవతము 3-263

అల్పసుఖములైన ఇంద్రియ సుఖములను పొంది నిరవధిక సుఖమును బొందజాలక దుఃఖించు మానవులకు భాగవతము నిగమార్థ ప్రతిపాదకమై శ్రీహరి గుణములు కథలు వర్ణించునదై ఆత్మానందమును గూర్చుచున్నది.

వేదాంత శ్రవణము చేతను, భగవద్గీతా పఠనము చేతను లభింపని భక్తి జ్ఞాన వైరాగ్యములు శ్రీ మద్భాగవత పఠనముచే లభించి ముక్తిదాయకములగుచున్నవి.

శుకుడు పరీక్షిత్తునకు భాగవతము వినిపించు నప్పుడు దేవతలు అమృత భాండమును గొనితెచ్చి ''భాగవత కథామృతమును మాకిచ్చి ఈ అమృతభాండమును స్వీకరింపు ''డని వేడికొనిరి. దానికి శుకు డంగీకరింపలేదు. భాగవత కథామృతము దేవతలకు గూడ దుర్లభము అది ''కాలవ్యాళ ముఖ గ్రాస త్రాస నిరాసకరము''. అమృతము కంటె శ్రేష్ఠము.

బ్రహ్మదేవుడన్నిముక్తి సాధనముల నొకవైపునను. భాగవతము నొకననైవునను పెట్టి త్రాసున తూచెను. భాగవతమే భారమైయగుపించెను.

''లఘూన్యా న్యాని జాతాని

గౌరవేణ ఇదం మహత్‌''

పద్మ పురాణములో భాగవత శ్రవణ ఫలము ముక్తి యనియు, అందులకు సాక్ష్యము పరీక్షిన్మహారాజనియు చెప్పబడినది.

శ్లో|| అసారే సంసారే విషయ విష సంగాకుల ధియః

క్షణార్థం క్షేమార్థం పిబతు శుక గాథా7తుల సుధాం

కిమర్థం వ్యర్థం భోగశ్చరత కుపథే కుత్సిత కథే

పరీక్షిత్‌ సాక్షీయాత్‌ శ్రవణగత ముక్త్యోక్తి కథనే ||

భాగవతము సర్వవేదసారము సంసార తారకము. భక్తి వర్ధనము శ్రీకృష్ణ ప్రీతికరము.

శ్లో|| #9; సర్వ సిద్ధాంత నిష్పన్నం

సంసార భయ నాశనం

భక్త్యోఘ వర్ధనం యచ్చ

కృష్ణ సంతోష హేతుకమ్‌. -సూతుడు

కలికాలమున శుకమహర్షిచే గానము చేయబడిన భాగవతము కాలమను సర్పముఖమున బడకుండ చేయును.

శ్లో|| కాల వ్యాల ముఖ గ్రాస త్రాస నిర్ణాదహేతవే

శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితమ్‌ ||

భాగవత పఠనము చేతనే ఈళ్వరుడు చిక్కును.

'శ్రీమంతమై ముని శ్రేష్ఠకృతంబైన భాగవతంబు

సద్భక్తితోడ వినగోరువారల విమలచిత్తంబుల జెచ్చెర నీశుండు

సిక్కుగాక, ఇతరశాస్త్రంబుల నీశుండు సిక్కునే?''

(భాగవతము : 1-36)

భాగవతాఖ్య మంత్ర మెట్టిదో చూడుడు.

ఉ|| ఎయ్యది కర్మంబంధముల నెల్ల హరించు, విభూతి కారణం

é బెయ్యది, సన్మునీంద్రులకు నెల్ల గవిత్వ సమాశ్రయంబు ము

న్నెయ్యది, సర్వమంత్రముల నెలినదెయ్యది, మోక్షలక్ష్మి రూ

పెయ్యది, దాని బల్కెదసు హృద్యమ భాగవతాఖ్య మత్రమున్‌

(భాగవతము:)

పెక్కులేల. భాగవత భక్తి మార్గము నవలంబించినవారికి పునర్జన్మ లేదు.

గీ|| పరమ భాగవతములు పాటించు పథమిది

ఈ పథమున యోగి ఏగెనేని

మగిడిరాడువాడు మరి సంశయములేదు

కల్పశతములైన కౌరవేంద్ర ! (భాగవతము : 2-33)

Sri Bhagavadgeetha Madanam-1    Chapters